భీమవరంలో ఫారెస్ట్ అధికారిపై ఏసీబీ దాడి — రూ.4 లక్షల లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి అటవీశాఖకు చెందిన ఒక అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేష్ ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసింది.
సురేష్ తన కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి రూ.4 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం నిందితుడి కార్యాలయం మరియు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే ఎంతటి అధికారులైనా తప్పించుకోలేరని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
