హైదరాబాద్: పదేళ్లలో 8 లక్షల మంది ఔట్ – సర్కారు బడుల్లో అడ్మిషన్ల పతనం
రాష్ట్రంలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. అధికారిక యూడైస్ లెక్కల ప్రకారం 2014–15లో 24.85 లక్షల మంది ఉన్న ఎన్‌రోల్‌మెంట్ 2025–26 నాటికి 16.51 లక్షలకు పడిపోయింది. అంటే పదేళ్లలోనే 8.34 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడులను వదిలిపోయారు.
📉 ఏటా లక్ష మంది తగ్గుదల
- 2014–15లో 26,114 ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లు
- విద్యార్థులు: 24,85,007
- 2025–26 నాటికి విద్యార్థులు: 16.51 లక్షలు
- సగటున ఏటా లక్ష మందికి పైగా తగ్గుదల
సర్కారు బడుల్లో ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్నప్పటికీ అడ్మిషన్లు తగ్గుతుండడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియంపై మోజు, సర్కారు బడులపై నమ్మకం తగ్గడం ప్రధాన కారణాలుగా విద్యావేత్తలు చెబుతున్నారు.
🦠 కరోనా టైంలో తాత్కాలిక పెరుగుదల
- 2020–21లో 19.73 లక్షలు
- 2021–22లో 23.25 లక్షలు (17.85% పెరుగుదల)
ప్రైవేటు ఫీజులు కట్టలేక చాలామంది పేరెంట్స్ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. కానీ సరిపడా టీచర్లు లేకపోవడం వల్ల 2022–23లో సంఖ్య మళ్లీ 20.48 లక్షలకు పడిపోయింది. ఆ తరువాత కూడా వరుసగా తగ్గుదల కొనసాగింది.
🏫 ప్రైవేటు బడుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
- 2014–15లో 28.96 లక్షలు
- 2024–25లో 36.82 లక్షలు
- 2025–26లో 37.36 లక్షలు
పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసైనా ప్రైవేటు బడుల వైపు మొగ్గు చూపుతున్నాయి. సర్కారు చదువులపై విశ్వాసం తగ్గడమే ఇందుకు కారణమని నిపుణుల అభిప్రాయం.
👩🏫 టీచర్లపై బోధనేతర భారం
టీచర్లను శిక్షణలు, మీటింగులు, ఎన్నికల విధుల్లో నిమగ్నం చేయడంతో తరగతులు ప్రభావితమవుతున్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిప్యూటేషన్ల సమస్యతో పిల్లలున్న చోట టీచర్లు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
🗣️ సంఘాల డిమాండ్లు
- అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు
- ప్రీప్రైమరీ నుంచి అడ్మిషన్లు
- క్లాసురూమ్‌కి ఒక టీచర్ తప్పనిసరి
- టీచర్లను బోధనకే పరిమితం చేయాలి
- ప్రజాప్రతినిధులను బడుల బలోపేతంలో భాగస్వామ్యం చేయాలి
విద్యారంగ సంస్కరణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అమలులో అధికారుల నిర్లక్ష్యమే పరిస్థితిని మరింత దిగజార్చుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
