ఉద్యోగులే సంస్థలకు అసలు బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి వివేక్
హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఏ సంస్థ విజయానికి ఉద్యోగులే అసలు బ్రాండ్ అంబాసిడర్లని, మంచి విధానాలను అమలు చేయడంలో హెచ్‌ఆర్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఉత్పాదకత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు.
గురువారం హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ నోవోటెల్లో ASSOCHAM నిర్వహించిన 3వ హెచ్‌ఆర్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని, గతంలో తాను CII అధ్యక్షుడిగా పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్‌లోనూ, అనంతరం కేంద్ర ప్రభుత్వంలోనూ కార్మికశాఖ మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. ఆ కాలంలో హెచ్‌ఆర్ సమస్యలు, వేతన వివాదాలు, కార్మిక అంశాలు విస్తృతంగా ఉండేవని, ప్రస్తుతం పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చాయని చెప్పారు.
గతంలో హెచ్‌ఆర్ విభాగానికి అంత ప్రాముఖ్యత లేకపోయినా, ఇప్పుడు అది సంస్థలలో అత్యంత కీలక విభాగంగా మారిందన్నారు. ఉద్యోగులను సక్రమంగా చూసుకోవడం, ఉత్తమ ఫలితాలు సాధించడం యాజమాన్యం మరియు హెచ్‌ఆర్ విభాగాల సంయుక్త బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడం, ఉత్పాదకత పెంచడం హెచ్‌ఆర్ నిపుణులకు ప్రధాన సవాలుగా మారిందని అభిప్రాయపడ్డారు.
ఈ సమ్మిట్ ద్వారా సంస్థల అభివృద్ధికి దోహదపడే సృజనాత్మక ఆలోచనలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. పాత ఐటీఐలను టాటా సంస్థ CSR సహకారంతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నామని, ఏడాది లోపల అవి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు.
ఈ కేంద్రాల నుంచి శిక్షణ పొందిన నైపుణ్య సిబ్బందిని పరిశ్రమలు నియమించుకోవాలని పరిశ్రమల ప్రతినిధులను కోరారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులపై సూచనలు ఇవ్వాలని హెచ్‌ఆర్ నిపుణులను అభ్యర్థించారు. పరిశ్రమలతో సమన్వయం పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
