అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధం
హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు కోసం కాంక్రీటు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బేస్‌మెంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ప్రాంగణంలో ఇప్పటికే మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అదే వరుసలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ విగ్రహానికి ఎడమవైపున 8 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉండగా, కుడివైపున అదే ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
ఈ విగ్రహ నిర్మాణం మరియు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం దాదాపు రూ.34 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విగ్రహం ప్రతిష్టాపనకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వాటికి ముందుగానే మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
