ఖమేనీ మృతిపై హైదరాబాద్‌లో నిరసనలు.. మౌలాలీలో ఉద్రిక్తత
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌలాలి కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఖమేనీ ఫ్లెక్సీ కలకలం రేపింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు యువకులు చింపేయడంతో స్థానికులతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఫ్లెక్సీ చించేసిన యువకులపై స్థానికులు దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఖమేనీ మృతిపై హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటీలోని Purani Haveli ప్రాంతంలో తంజీమ్-ఏ-జాఫెరీ సంస్థ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరసనకారులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ ముర్దాబాద్, Benjamin Netanyahu ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా వందలాది మంది రోడ్డుపైకి రావడంతో ఓల్డ్ సిటీలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
