13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
అమరావతి: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
సోషల్ మీడియా ప్రభావం చిన్నారుల చదువు, ఆరోగ్యంపై తీవ్రంగా పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి విధివిధానాలు రూపొందించామని, వచ్చే 90 రోజుల్లో నిపుణుల అభిప్రాయాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అదే సమయంలో 13 నుంచి 16 ఏళ్ల వయస్సు గల పిల్లలు సోషల్ మీడియా వాడకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని. పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల చదువుపై దృష్టి తగ్గడం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా కర్ణాటకలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు సీఎం సిద్దరామయ్య. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతున్న ప్రతికూల ప్రతికూలతను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బెంగళూరులో ఇటీవల జరిగిన వైస్-ఛాన్సలర్ల సదస్సులో నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చర్యలు చర్చనీయాంశంగా మారాయి.
