గల్ఫ్ యుద్ధ భయం.. రాజన్నసిరిసిల్లలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్
రాజన్నసిరిసిల్ల: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.
ప్రస్తుతం ఇరాన్పై అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా మిగతా గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు చేస్తోందన్న సమాచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ తమ కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్లు చేసి వారి క్షేమాన్ని తెలుసుకుంటున్నారు.
రెండు జిల్లాల నుంచే ఎక్కువ మంది
రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ఉండగా, అందులో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచే దాదాపు 8 లక్షల మంది పనిచేస్తున్నట్లు గల్ఫ్ ఎన్నారై ప్రతినిధులు చెబుతున్నారు.
యుద్ధ వార్తలతో మరింత భయం
ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో వస్తున్న వీడియోలు, వార్తలు కుటుంబ సభ్యుల్లో మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. వారం రోజులుగా యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండటంతో గల్ఫ్‌లో ఉన్న తమ వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
అబుదాబి దాడిలో సిరిసిల్ల వాసికి గాయాలు
నాలుగు రోజుల క్రితం అబుదాబి విమానాశ్రయంపై జరిగిన బాంబు దాడిలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నందెల్లి రాజేశ్వర్‌రావు గాయపడ్డారు. ఆయన గత నాలుగేళ్లుగా అక్కడి విమానాశ్రయంలో శుభ్రత విభాగంలో పనిచేస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం గదిలో విశ్రాంతి తీసుకుంటున్న రాజేశ్వర్‌రావును స్వదేశానికి రప్పించాలని ఆయన భార్య మీనా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
క్యాంప్‌పై యుద్ధ విమానాలు
“దుబాయ్, షార్జాలో మా క్యాంప్‌పై రాత్రి, ఉదయం యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. షార్జా ప్రధాన నగరంపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలతో భయంగా ఉంది. మా క్యాంప్‌లో ఉన్నవారంతా ఆందోళనలో ఉన్నారు. ఇంటి నుంచి రోజుకు పది సార్లు ఫోన్ చేస్తున్నారు. ప్రతి క్షణం భయం గుప్పిట్లోనే ఉంది” అని షార్జాలో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికుడు బత్తుల చంద్రం తెలిపారు.
నా కొడుకు ఎట్లుంటాడోనని భయం
“నా కొడుకు గుర్రం సాయితేజ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ యుద్ధం జరుగుతుండటంతో ఎట్లుంటాడోనని భయంగా ఉంది. ఇంటికి రావాలని చెప్పినా విమానాశ్రయం మూసి ఉందని, విమానాలు నడవడం లేదని చెబుతున్నాడు. యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని చెబుతున్నాడు” అని ఎల్లారెడ్డిపేటకు చెందిన గుర్రం భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో గడుపుతున్నాయి.
