ఇందిరమ్మ ఇండ్లకు 99 రోజుల యాక్షన్ ప్లాన్.. ఉగాది నాటికి 15 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ లక్ష్యం
హైదరాబాద్:
రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే మూడు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించడం, నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయడం లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అనేక శుభ ముహూర్తాలు ఉండటంతో గృహప్రవేశాలు, ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈ షెడ్యూల్‌ను అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీలు) ఏఈలు, ఏఈఈలకు పంపించారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు నిర్వహించడంతో పాటు నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో వారంలో జిల్లాల వారీగా హౌసింగ్ అధికారులు డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తారు.
మూడో వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. నాలుగో వారంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్మిస్తున్న డెమో హౌస్‌లను అధికారులు పరిశీలిస్తారు. ఇల్లు మంజూరైనా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను ఏప్రిల్ మొదటి వారంలో గుర్తిస్తారు.
అదే నెల రెండో వారంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను అధికారులు తనిఖీ చేస్తారు. మూడో వారంలో ఇటుకలు, సెంట్రింగ్ సామగ్రి వంటి నిర్మాణ సామగ్రిని మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ చర్యల ద్వారా గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
