‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం.. అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి రోజైన శుక్రవారం అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ముందస్తు పండుగలా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజు నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను అధికారులు క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకు అవసరమైన పౌర సేవలను అందించేందుకు ఈ ప్రణాళికను ఐదు దశల్లో అమలు చేయనున్నారు. ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామ, వార్డు సభల్లో స్కీముల వారీగా ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను బహిరంగంగా ప్రదర్శించనున్నారు. అవసరమైతే ఆ జాబితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సవరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు.
గతంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి ఎందుకు ఆగిపోయాయో సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ యాక్షన్ ప్లాన్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించి, వాటిపై తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచి రైతులు అదనపు ఆదాయం పొందే మార్గాలపై అవగాహన కల్పిస్తారు. స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటారు.
రేషన్ కార్డుల పంపిణీని నిరంతర ప్రక్రియగా మార్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందించనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఈ ప్రణాళిక ద్వారా దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో మహిళా శక్తి భవనాలను కూడా ప్రారంభించనున్నారు.
వారానికో లక్ష్యం
ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసింది. మార్చి 30 నుంచి జూన్ 6 వరకు పది వారాల పాటు వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- మార్చి 30–ఏప్రిల్ 4: గ్రామీణాభివృద్ధి
- ఏప్రిల్ 6–11: ఆరోగ్య రంగం
- ఏప్రిల్ 13–18: ‘అరైవ్–అలైవ్’ (రోడ్డు భద్రత)
- ఏప్రిల్ 20–25: సంక్షేమ కార్యక్రమాలు
- ఏప్రిల్ 27–మే 2: పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణ
- మే 4–9: రైతు సంక్షేమం
- మే 11–16: విద్యా రంగం
- మే 18–23: యువత, క్రీడలు
- మే 25–30: మహిళా సంక్షేమం
- జూన్ 1–6: పర్యావరణ పరిరక్షణ
గత రెండేళ్లలో అమలైన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు జరిగిన మేలును గ్రామ సభల్లో వివరించనున్నారు. సర్పంచులు నుంచి ఎంపీలు, కలెక్టర్లు నుంచి కార్యదర్శులు వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. మండలాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ‘ప్రజా పాలన’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
