పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బెంగాల్‌కు బదిలీ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల నియామకం, బదిలీలపై గురువారం రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. ఆయన 2024 జూలై 31 నుంచి తెలంగాణ గవర్నర్‌గా దాదాపు ఏడాదిన్నర కాలం విధులు నిర్వహించారు.
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్)ను నియమించారు. నాగాలాండ్ గవర్నర్‌గా నంద కిశోర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్‌కు తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించగా, మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. కొత్తగా నియమితులైన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన రోజునుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
