ఇరాన్ దాడులతో దుబాయ్‌లో హై అలర్ట్.. ప్రజలకు వరుస హెచ్చరికలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు తాజా పరిణామాలతో గజగజలాడుతున్నాయి. మొదట్లో పరిస్థితిని తేలికగా తీసుకున్న కొన్ని దేశాలు.. ఇప్పుడు ఇరాన్ దాడులు పెరుగుతుండటంతో డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వాలు వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఇరాన్ దాడులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో గ్లోబల్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్‌లో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం దుబాయ్ నివాసితుల మొబైల్ ఫోన్లకు వరుసగా “క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉంది” అంటూ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు రావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గత వారం రోజులుగా ఇరాన్ అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అలర్ట్స్ మరింత కలకలం రేపాయి.
దుబాయ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు వరుసగా నాలుగు హెచ్చరికలు పంపింది. అత్యవసరం తప్ప బయటకు రావద్దని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు తమ పాస్‌పోర్టులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లతో ఒక బ్యాగ్ సిద్ధం చేసుకుని, నిత్యావసర వస్తువులను కూడా నిల్వ చేసుకుంటున్నట్లు అక్కడ నివసిస్తున్న వారు తెలిపారు.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారనే వార్తల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు పెరగడం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో వేలాది మంది భారతీయులు యూఏఈలో చిక్కుకుపోయారు. అయితే పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించిన దుబాయ్ అధికారులు.. సోమవారం నుంచి చాలామందిని సురక్షితంగా భారత్‌కు పంపగలిగారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల్లో తాము అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తున్నామనే వార్తలను యూఏఈ ప్రభుత్వం ఖండించింది. తమ రక్షణ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్, అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు జరపడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
