చాచా నెహ్రూ పార్క్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం… ఈ–వేస్ట్ కేంద్రాలు, అద్దాల లైబ్రరీ ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలోని చాచా నెహ్రూ పార్క్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాల కియోస్క్‌లను కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి 99 రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ ఇండ్లలో పాడైపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ–వేస్ట్ కియోస్క్ కేంద్రాలకు తీసుకువచ్చి రీసైక్లింగ్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.35 కోట్ల జీరో వడ్డీ రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కూడా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ముందుకు వస్తే వారికి ఆర్టీసీ బస్సులు ఇచ్చి యజమానులుగా తయారు చేస్తామని మంత్రి తెలిపారు.
తర్వాత పార్కులో 1500 చదరపు గజాల్లో ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ గ్రంథాలయ సమితి చైర్మన్ కె. ఉపేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన దాసరి, గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అదనపు కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అద్దాల లైబ్రరీ ప్రత్యేకత
పార్క్‌లో ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీను గోడలకు బదులుగా పూర్తిగా అద్దాలతో నిర్మించారు. ఎటు చూసినా అద్దాలు మాత్రమే కనిపించేలా దీన్ని రూపొందించారు. ఇందులో వివిధ రకాల పుస్తకాలతో పాటు కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచారు.
ఈ–వేస్ట్‌కు డిస్కౌంట్ కూపన్లు
ఇళ్లలో వినియోగించని ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాల్లో అందజేసిన వారికి గిఫ్ట్‌లు, డిస్కౌంట్ కూపన్లు ఇస్తున్నారు. ఇందుకోసం పలు ఎలక్ట్రానిక్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ కేంద్రాల్లో ఇచ్చిన కూపన్లతో తిరిగి వస్తువులు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. ఈ–వేస్ట్‌గా ఇచ్చిన వస్తువుల విలువ ఆధారంగా రూ.500 నుంచి రూ.1000 వరకు కూపన్లు అందిస్తున్నారు.
