AI యుగంలోనూ చెక్కుచెదరని వ్యాపారం… 18 ఏళ్లకే నెలకు ₹10 లక్షల టర్నోవర్ సాధించిన పంజాబ్ యువకుడు
AI కారణంగా ఉద్యోగ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న వేళ, మెషీన్లకు అందని రంగంగా పాడి పరిశ్రమ మరోసారి తన ప్రత్యేకతను చాటుతోంది. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా మనిషికి అవసరమైన స్వచ్ఛమైన పాలను ఇప్పటికీ AI సృష్టించలేకపోయింది. ఈ సత్యాన్ని నమ్మి ముందడుగు వేసిన పంజాబ్ యువకుడు సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ, కేవలం 18 ఏళ్ల వయస్సులోనే నెలకు ₹10 లక్షల టర్నోవర్ సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
పంజాబ్ రాష్ట్రం బర్నాలా జిల్లా సమీపంలోని సెహ్నా గ్రామానికి చెందిన సోహల్‌ప్రీత్ కథ సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ సక్సెస్ స్టోరీ కాదు. చెమట చిందించి సాధించిన నిజమైన విజయగాథ. సరిగ్గా 15 ఏళ్ల వయస్సులో, తోటి పిల్లలు కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్న సమయంలో, సోహల్‌ప్రీత్ తన తండ్రిని ₹1.2 లక్షల పెట్టుబడి కోరాడు. అదే ఈరోజు 120 పశువులతో కూడిన ఆధునిక డైరీ ఫామ్‌గా రూపుదిద్దుకుంది.
ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి పశువుల ఆరోగ్య పర్యవేక్షణ నుంచి పాలు పితకడం వరకు ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ప్రస్తుతం అతని ఫామ్‌లో 55 గేదెలు, 15 ఆవులు, 50 దూడలు ఉన్నాయి. వీటివల్ల రోజుకు సగటున 700 లీటర్ల పాలను సేకరించి ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తున్నాడు. గేదె పాలు లీటరుకు ₹65–70, ఆవు పాలు లీటరుకు సుమారు ₹40 వరకు ధర లభిస్తోంది.
పశువులకు అవసరమైన మేతను స్వయంగా పండించడంతో ఖర్చులు గణనీయంగా తగ్గి, సుమారు 60 శాతం వరకు లాభం మిగులుతోంది. దీంతో నెలకు ₹5–6 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నాడు.
అయితే ఈ విజయం సులభంగా రాలేదు. వ్యాపార నష్టాలు, పశువుల కొనుగోళ్లలో మోసాలు, అనారోగ్య సమస్యలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వచ్చిన లాభాలను లగ్జరీల కోసం ఖర్చు చేయకుండా తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టుతూ ఫామ్‌ను విస్తరిస్తున్నాడు.
కేవలం డిగ్రీలే కాదు, నేర్చుకోవాలనే తపన, కష్టపడే స్వభావం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ తన జీవితంతో నిరూపిస్తున్నాడు.
