విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్‌కు ఇంకుడు గుంత తప్పనిసరి
హైదరాబాద్ సిటీ :
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్లకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) కొత్త నిబంధనను అమలు చేయనుంది. 200 చదరపు గజాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని వాటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాటర్ బోర్డు సేవలు 1,450 చ.కి.మీ. వరకు ఉండగా, ORR వెలుపలి ప్రాంతాలను విలీనం చేయడంతో మరో 603 చ.కి.మీ. విస్తరించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు నల్లా కనెక్షన్లు లేని వారు పెద్ద సంఖ్యలో కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకు 2 వేలకుపైగా అప్లికేషన్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి సరఫరా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన వాటర్ బోర్డు అధికారులు, ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు క్రమంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాబోయే వర్షాకాలంలో భూగర్భ జల నిల్వలు పెంచే ఉద్దేశంతో తప్పనిసరి ఇంకుడు గుంతల నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఈ నిబంధన 200 చ.గజాల్లో నిర్మించిన ఇండ్లకే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మూడు నెలల్లో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యం
విలీన ప్రాంతాల్లో 90 రోజుల్లో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని వాటర్ బోర్డు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధి నుంచి ORR వరకు నోడల్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నోడల్ అధికారి తన పరిధిలో కనీసం 2 వేల ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
సింగిల్ విండో సెల్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి, ఆయా ఇండ్లకు వెళ్లి ఇంకుడు గుంత ఉందా లేదా అన్నది క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. ఇంకుడు గుంత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లా కనెక్షన్ ఇవ్వకూడదని ఆదేశించారు. మూడు నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
