అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తుపై ఏఏఐబీ స్పష్టీకరణ
ఎవరినైనా విచారించే అధికారం ఉంది.. ఇది వేధింపులు కావు: ఏఏఐబీ
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం కేసులో పైలట్ మేనల్లుడికి సమన్లు జారీ చేయడాన్ని ఖండిస్తూ పైలట్ల సమాఖ్య (FIP) లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో ‘విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో’ (AAIB) స్పందించింది. విమాన ప్రమాదంపై దర్యాప్తు విషయంలో తాము పూర్తిగా చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామని ఏఏఐబీ అధికారులు స్పష్టం చేశారు.
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలను తెలుసుకునేందుకు అన్ని కోణాలనూ పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. దర్యాప్తుకు ఉపయోగపడుతారని భావిస్తే ఎవరినైనా, ఎన్ని సార్లు అయినా విచారించే అధికారం తమకు ఉందని వెల్లడించారు. ఈ ప్రక్రియను వేధింపులుగా చిత్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు.
గత ఏడాది జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కెప్టెన్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు, ఎయిరిండియా పైలట్‌గా పనిచేస్తున్న కెప్టెన్ వరుణ్ ఆనంద్‌కు ఏఏఐబీ ఇటీవల సమన్లు జారీ చేసింది. జనవరి 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వరుణ్ ఆనంద్ భారత పైలట్ల సమాఖ్య (FIP) సభ్యుడిగా ఉండటంతో ఈ చర్యపై సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలవడం అనవసరమని, ఇది వేధింపులకు పాల్పడటంతో పాటు మానసిక క్షోభకు గురిచేయడమేనని పేర్కొంటూ ఏఏఐబీకి లీగల్ నోటీసులు పంపింది.
ఈ నేపథ్యంలో ఏఏఐబీ తన వైఖరిని స్పష్టంచేస్తూ, దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని అంశాలపై విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.
