సంక్రాంతి రిటర్న్ ట్రాఫిక్‌కు ముందస్తు మళ్లింపులు
NH-65పై ఫ్లైఓవర్ పనులతో జామ్ అవకాశం.. ప్రయాణికులకు నల్లగొండ పోలీసుల సూచనలు
హైదరాబాద్: సంక్రాంతి పండగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ముఖ్యంగా ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని నల్లగొండ పోలీసులు హెచ్చరించారు.
చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్న కారణంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశముందని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ఓర్పుతో ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు.
