యువత ఉపాధికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు కీలకం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జనవరి 19: రాష్ట్రవ్యాప్తంగా యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్మిక మరియు ఉపాధి, గనులు–భూగర్భశాస్త్ర శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించి, నూతన ఉద్యోగావకాశా సృష్టించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను స్థాపిస్తుందని తెలిపారు. సోమవారం చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న నూతన స్వతంత్ర ATC భవనానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడారు. ఎదుగుతున్న రంగాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఈ కేంద్రం స్థానికంగా ప్రతి యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. చెన్నూర్ ప్రజలకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ డా. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారని, ఆ హామీని నేడు ఏటీసీ పనుల కొరకు భూమి పూజ చేయడం ద్వారా నెరవేర్చామని అన్నారు. ఇక్కడ యువతకు నూతన కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తాం. ఈ సంస్థ యువతతో పాటు వారి కుటుంబాల భవిష్యత్తును భద్రపరిచే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో గతంలో తీవ్రమైన నిధుల కొరత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రితో చర్చించి జిల్లా ఖనిజ నిధి ట్రస్ట్ (DMFT), SDF, TFIDC ద్వారా రూ.100 కోట్ల నిధులను సమీకరించి, నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించామని తెలిపారు. గతం లో దివంగత కాకా వెంకటస్వామి మరియు మాజీ మంత్రి జి. వినోద్ కృషితో ఈ ప్రాంతంలో 850 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబడిందని, దాని ద్వారా సుమారు 5,000 మంది స్థానిక యువతకు ఉపాధి లభించిందని డా. వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. త్వరలో మరో విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటుకానుండగా, దాని ద్వారా మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు. ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య వంతులైన యువతకు అందించడంలో ATCs కీలకంగా నిలుస్తాయని తెలిపారు. చెన్నూర్, సోమనపల్లిలో రూ.250 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులు, ప్రజల సహకారంతో చెన్నూర్ రూపురేఖలను మార్చి, అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
