ఏఐ షాక్.. కుదేలైన ప్రపంచ టెక్ షేర్లు
హైదరాబాద్ :
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ రోజురోజుకూ అత్యాధునికంగా మారుతూ మార్కెట్‌ను ఊహించని వేగంతో కుదిపేస్తున్నాయి. మానవుల అంచనాలకే కాదు… దశాబ్దాలుగా టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీల వ్యూహాలకు కూడా అందనంత వేగంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
ఈ ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడుతోంది. అమెరికా నుంచి భారత మార్కెట్ల వరకు టెక్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే నిఫ్టీ ఐటీ సూచీ ఇంట్రాడేలో దాదాపు 6 శాతం క్షీణించింది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ సహా ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో ఇన్వెస్టర్లతో పాటు ఐటీ రంగంలో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు ఏఐ వల్ల ఐటీ కంపెనీలకు భారీ లాభాలు వస్తాయని భావించిన మార్కెట్ వర్గాలు… ఇప్పుడు అదే ఏఐ కొత్త సవాళ్లను విసురుతోందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ తన క్లాడ్ (Claude) చాట్‌బాట్ కోసం ఇటీవల ప్రవేశపెట్టిన అధునాతన లీగల్ టూల్ టెక్ రంగంలో పెను సంచలనంగా మారింది. ఈ టూల్ లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి క్లిష్టమైన పనులను కూడా స్వయంచాలకంగా నిర్వహించగలగడం సంప్రదాయ ఐటీ సేవల కంపెనీల మనుగడపై ప్రశ్నార్థకంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్‌లో టెక్ షేర్లు భారీగా అమ్మకాలకు గురయ్యాయి. ఏఐ రంగంలో అగ్రగాములైన ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 3 శాతం పడిపోగా… సేల్స్‌ఫోర్స్, అడోబ్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఏకంగా 7 శాతం వరకు నష్టపోయాయి. గతంలో ఏఐ వల్ల ఈ కంపెనీలు మరింత లాభపడతాయని నిపుణులు అంచనా వేసినా… ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో అమెరికా టెక్ సూచీ నాస్డాక్ 1.43 శాతం క్షీణించింది.
అమెరికా మార్కెట్లలో మొదలైన ఐటీ షేర్ల అమ్మకాల ప్రభావం ఇప్పుడు భారతీయ ఐటీ రంగంపై కూడా తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఉన్న భారత ఐటీ కంపెనీల వాల్యుయేషన్లకు అమెరికా నుంచి వస్తున్న ఈ సంకేతాలు భారీ దెబ్బగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో భారత మార్కెట్ ర్యాలీకి బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఐటీ రంగంలో జరుగుతున్న ఈ అనూహ్య మార్పులు కేవలం కంపెనీల లాభాలకే కాకుండా… మొత్తం టెక్ సర్వీస్ ఇండస్ట్రీ నిర్మాణాన్నే మార్చే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏఐ ఒక అవకాశంగా మాత్రమే కాకుండా… ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్ సామ్రాజ్యాలకు పెద్ద విఘాతంగా మారుతుండటం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
