ఎటెర్నల్ సీఈఓగా అల్బీందర్ దిండ్సాబాధ్యతల నుంచి తప్పుకున్న దీపిందర్ గోయల్
ఇంటర్నెట్ డెస్క్:
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ (Eternal)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తన సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బీందర్ దిండ్సా ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ, “ఇటీవల కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. అవి పూర్తిగా ప్రయోగాత్మకమైనవి, అధిక రిస్కుతో కూడుకున్నవి. ఎటెర్నల్ వంటి లిస్టెడ్ కంపెనీలో ఉండి ఇలాంటి ప్రయోగాలు చేయడం కష్టం. అందుకే సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను” అని తెలిపారు.
ఇకపై ఎటెర్నల్ గ్రూప్ రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ ప్రాధాన్యాలు, వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నింటినీ అల్బీందర్ దిండ్సానే తీసుకుంటారని దీపిందర్ వెల్లడించారు. బ్లింకిట్‌ను బ్రేక్ ఈవెన్ దశకు తీసుకురావడంలో అల్బీందర్ కీలక పాత్ర పోషించారని, ఎటెర్నల్ గ్రూప్‌ను సమర్థవంతంగా నడిపించగల సామర్థ్యం ఆయనకు ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
వాటాదారుల ఆమోదంతో దీపిందర్ గోయల్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా, బోర్డు డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఆయనకు సంబంధించిన అన్‌వెస్టెడ్ స్టాక్ ఆప్షన్స్ అన్నీ తిరిగి ESOP పూల్‌కు బదిలీ కానున్నట్లు కంపెనీ తెలిపింది.
₹102 కోట్ల నికర లాభం నమోదు చేసిన ఎటెర్నల్
జొమాటో, బ్లింకిట్ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎటెర్నల్ గ్రూప్ బుధవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.102 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.59 కోట్లతో పోలిస్తే లాభంలో 72.88 శాతం వృద్ధి కనిపించింది.
త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎటెర్నల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.90 శాతం లాభపడి రూ.282.80 వద్ద ముగిసింది.
