Anam: ‘బాబు పాలన కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకపోతే ఎంత’
నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధగా ఉంది. చంద్రబాబును స్టేట్స్‌మన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఆయన పరిపాలన కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకపోతే ఎంత’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్‌తో సుపరిపాలన అందించి సూపర్‌హిట్ కొట్టామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మాటలకే పరిమితమైన గత ప్రభుత్వానికి భిన్నంగా.. కూటమి ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తుచేశారు. ఆగమశాస్త్ర నియమాల మేరకు ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను సరిచేశామని చెప్పారు. దేవాదాయశాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వేద విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని, ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
