పాత ఫోన్లు అమ్ముతున్నారా? జాగ్రత్త!.. నేరం ఎవరిదైనా కేసు మీపైనే
సాంకేతిక ప్రపంచంలో నగరాల్లోని అనేక ఇళ్లలో ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటిలో పనిచేయని పాత ఫోన్లు, బేసిక్ మోడల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే అవకాశంగా భావించి ‘పాత ఫోన్లు కొంటాం’ అంటూ ఆటోలపై వీధుల్లోకి వస్తున్న దందగాళ్లు కనిపిస్తున్నారు. స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని, అవి వద్దంటే అడిగినంత నగదు ఇస్తామని ఆశ చూపుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఏదీ అంత చౌకగా రాదు!
ఖరీదైన ఫోన్‌ను తక్కువ ధరకు అమ్ముతామని, అత్యవసరం ఉందని చెప్పి కొందరు ప్రజలను నమ్మిస్తారు. కానీ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు కొనడం లేదా వారికి అమ్మడం చట్టపరమైన చిక్కులకు దారి తీస్తుంది.
ఆ ఫోన్ చోరీదైనా, గతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించినదైనా, లేదా ఏదైనా కేసులో ఐఎంఈఐ నంబర్ నమోదై ఉన్నా—ఆ ఫోన్ చేతులు మారిన వ్యక్తి జైలు పాలయ్యే ప్రమాదం ఉంది. నకిలీ ఫోన్ అయితే నష్టమే మిగులుతుంది.
ఇవి తప్పక గమనించండి
పనిచేసే స్థితిలో ఉన్న పాత ఫోన్లను కంపెనీలు అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్లకు వినియోగించుకోవడం ఉత్తమం. లేకపోతే నగరపాలక, పురపాలక సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ఈ-వ్యర్థాల కలెక్షన్ కేంద్రాల్లో అందజేయాలి.
వీధుల్లో తిరుగుతూ పాత ఇనుములా ఫోన్లు కొనేవారిని నమ్మకూడదు. ఆ ఫోన్లతో వారు ఏం చేస్తారనే సందేహం రావాలి. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వ్యక్తిగత సమాచారం అంగడి సరకుగా మారే ప్రమాదం ఉంది.
సైబర్ ముఠాలకు ఫోన్ల విక్రయం
పోలీసుల వద్దనున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలో ప్రజల నుంచి తస్కరించిన, పాతవిగా సేకరించిన ఫోన్లను మరమ్మతు కేంద్రాలకు విక్రయిస్తున్నారు. అక్కడ వాటిని బాగుచేసి సైబర్ ముఠాలకు అధిక ధరలకు అమ్మేస్తున్నారు. నేరప్రవృత్తి గలవారి చేతిలో పడితే వ్యక్తిగతంగా తీవ్ర నష్టం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానితులు కాలనీలకు వచ్చి ఫోన్లు కొంటామంటే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా మహిళలు ప్రత్యేకంగా జాగ్రత్తపడాలని పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తోంది.
డేటా చోరీ ప్రమాదం
పాత ఫోన్లు చేతికి చిక్కితే దాంట్లోని డేటాను చోరీ చేస్తారు. యూపీఐ ఐడీలు, మొబైల్ నంబర్లు, కాంటాక్ట్ లిస్ట్, ఫొటోలు డౌన్‌లోడ్ చేస్తారు. సోషల్ మీడియా ఖాతాల్లోకి చొరబడి బ్లాక్‌మెయిల్ ద్వారా ఆర్థిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇదీ సాధ్యం కాకపోతే మరో సిమ్ వేసి మోసాలకు వినియోగిస్తారు.
పోలీసులు కేసుల దర్యాప్తులో ఐఎంఈఐ నంబర్ ఆధారంగా విచారణ చేపడతారు. అసలు నేరస్థుడు దొరకని సందర్భాల్లో పాత ఫోన్ అమ్మిన యజమాని వివరాలే ముందుకు వస్తాయి. నేరంతో సంబంధం లేకున్నా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
