న్యూఢిల్లీలో దారుణం.. ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో కొట్టి వ్యాపారవేత్త హత్య
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారి 36 ఏళ్ల వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో విచక్షణరహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ శివం గుప్తా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన శివం గుప్తా (36) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ, తన బావమరిదితో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2026 జనవరి 3న శివం గుప్తా తన స్నేహితుడితో కలిసి పార్టీకి వెళ్లాడు. పార్టీ ముగిసిన అనంతరం రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలోని కన్నాట్ ప్లేస్ వద్ద ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో అతనికి ఘర్షణ చోటుచేసుకుంది.
మొదట మాటల తూటాలుగా ప్రారంభమైన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరింది. ఆగ్రహంతో ఊగిపోయిన డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న హెల్మెట్లతో శివం గుప్తాపై దాడికి దిగారు. రోడ్డుపై పడేసి రక్తం వచ్చేలా కొట్టి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన శివం గుప్తాను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే గాయాలు మితిమీరడంతో బుధవారం (జనవరి 4) శివం గుప్తా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శివం గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఢిల్లీలో ప్రజా భద్రతపై ఆందోళన కలిగించడమే కాకుండా, చిన్నపాటి ఘర్షణలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో మరోసారి గుర్తు చేస్తోంది.
