మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పుల యత్నం.. తృటిలో తప్పించిన భద్రతా సిబ్బంది
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల యత్నం ఘటన కలకలం రేపింది. బుధవారం (మార్చి 11) సాయంత్రం జమ్మూలోని కైలాష్ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లాపై ఓ దుండగుడు వెనకనుంచి వచ్చి తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పెళ్లి వేడుకలో ఫరూఖ్ అబ్దుల్లా వెనుకనుంచి వచ్చిన వ్యక్తి తుపాకీతో ఆయన తలకు గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతడిని 60 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్గా పేర్కొన్నారు. జమ్మూ నివాసి అయిన కమల్ సింగ్ అక్కడ కొన్ని షాపులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో నిందితుడు గత 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నించినట్లు వెల్లడించినట్లు సమాచారం. లైసెన్స్‌డ్ గన్ తీసుకున్నట్లు కూడా అతడు తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
