చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్.. భారత్‌లో ఇది సాధ్యమేనా?
ఇంటర్నెట్‌డెస్క్: చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు, వాటి ప్రభావం వల్ల తెలిసీతెలియని వయస్సులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, రెడిట్, స్నాప్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాలను వారు వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు అమలుచేస్తున్న తొలి దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ నిబంధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది.
భారత్‌లో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికం. అందువల్ల తక్షణమే ఈ తరహా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముందని కొందరు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు కూడా ఈ చర్చల్లో భాగస్వాములవుతుండటం గమనార్హం. సినీనటుడు సోనూసూద్ కూడా ఈవిషయంపై స్పందించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అవకాశాలను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో బ్యాన్ ?
భారత్‌లో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. గణాంకాల ప్రకారం చాలామంది చిన్నారులు స్మార్ట్‌ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానం అవుతున్నారు. అది కూడా తమ తల్లిదండ్రుల మొబైల్స్ నుంచే. 80శాతం మంది రోజుకు మూడు గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలావరకు తల్లిదండ్రుల ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాలపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్‌ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్‌ను తొలగించి మరీ, నచ్చిన యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల దీంతో ప్రయోజనం అంతంతే.
లాభాలూ ఉన్నాయి
సామాజిక మాధ్యమాల వల్ల లాభాలూ ఉన్నాయి. చిన్నారులు తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఇవి వేదికలనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ ఇలా అన్ని రంగాల్లోనూ పిల్లలు తమ నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా తమ జీవితాలను మలచుకున్నవారూ ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన ఎంతో పాజిటివ్ కంటెంట్ సోషల్‌మీడియాలో దొరుకుతుంది. కోడింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి సోషల్ మీడియా ద్వారా సులభమవుతాయి. ఒకే రకమైన ఆసక్తులు ఉన్నవారు తమ భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ వేదిక. అయితే, తమ పిల్లలు ఏ కంటెంట్‌ను చూస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం తప్పనిసరి.
కొన్ని మార్పులు చేర్పులతో..
అక్కడి కుటుంబ పరిస్థితులు, విద్యా విధానాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ.. ఆస్ట్రేలియా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో.. దానిని అలాగే అమలుచేయడం సాధ్యం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లోనూ పిల్లలకు యూట్యూబ్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలు తమకు అర్థంకాని విషయాలు, పాఠ్యాంశాల గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. అందువల్ల.. పిల్లల్ని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం మంచిదే అయినప్పటికీ.. అవసరమైన చిన్నపాటి మార్పులతో ఈ తరహా విధానాలను అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా.. పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సోషల్ మీడియా ప్రభావం వారిపై ఎంతమేర ఉందన్నది అంచనా వేసి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
