ఓరుగల్లులో బీసీ జపం…
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట
354 మంది బీసీలకు ప్రధాన పార్టీల టికెట్లు
వరంగల్: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో బీసీలు రాజకీయ కేంద్రబిందువుగా మారారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు పెద్దపీట వేస్తూ టికెట్ల కేటాయింపులో పోటీ పడ్డాయి. బీసీ రిజర్వేషన్ ఉన్న స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ బీసీలకే ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన పార్టీలు మొత్తం 354 మంది బీసీ అభ్యర్థులకు బీఫారాలు అందించాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా, వీటిలో 260 వార్డులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ల ప్రకారం రెండు మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ అవకాశం లేకపోయింది. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో మొత్తం 50 వార్డులు బీసీలకు అధికారికంగా రిజర్వ్ అయ్యాయి. మిగతా 210 వార్డులు ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలకు కేటాయించబడ్డాయి.
రిజర్వేషన్‌కు మించి బీసీలకే ప్రాధాన్యం
బీసీలకు కేవలం 50 రిజర్వేషన్ స్థానాలే ఉన్నప్పటికీ, మూడు ప్రధాన పార్టీలు వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బీసీలకు టికెట్లు కేటాయించాయి. లెక్కల ప్రకారం మూడు పార్టీల నుంచి రిజర్వేషన్ స్థానాల్లో గరిష్ఠంగా 150 మందికే అవకాశం దక్కాల్సి ఉండగా, వాస్తవంగా 354 మంది బీసీలు టికెట్లు పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓరుగల్లు పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, జనగామ, స్టేషన్ ఘణపూర్, తొర్రూర్, కేసముద్రం, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో బీసీ రిజర్వేషన్లు ఉండగా, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ కలిసిరాలేదు. అయినప్పటికీ ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ జనరల్ స్థానాల్లో 14 మంది బీసీలకు మూడు పార్టీలు టికెట్లు ఇచ్చాయి.
పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేరుగా 119 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది. పలు మున్సిపాలిటీల్లో పొత్తులలో భాగంగా సీపీఐ, సీపీఎం తరఫున కూడా కొందరు బీసీలకు అవకాశం కల్పించింది. బీఆర్‌ఎస్ పార్టీ 122 మంది బీసీలకు కారు గుర్తుపై పోటీ చేసే అవకాశమివ్వగా, బీజేపీ 113 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది.
జనరల్ స్థానాల్లోనూ బీసీల దూకుడు
బీసీలకు రిజర్వేషన్ ఉన్న 50 వార్డుల్లోనే కాకుండా, జనరల్ కేటగిరీ స్థానాల్లోనూ బీసీలను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీసీ సామాజిక వర్గానికి సముచిత గౌరవం ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓరుగల్లులో బీసీ ఓటుబ్యాంక్ కీలకంగా మారిందనడానికి ఈ టికెట్ల కేటాయింపే నిదర్శనంగా నిలుస్తోంది.
