BCCI: ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయండి: కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) దక్కించుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ తాజాగా కేకేఆర్‌కు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
అయితే గురువారం కూడా ముస్తాఫిజుర్ ఎంపికపై బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి. ఇది తమ చేతుల్లో లేని వ్యవహారమని, దీనిపై ఇంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదని వెల్లడించాయి. రెహమాన్ 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు తీసుకున్నాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టు ఆడే సిరీస్‌లపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దౌత్య విభేదాల వేళ భారత్‌తో షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. భారత్‌తో ఆగస్టు-సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. గత ఏడాది రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరగాల్సిఉండగా.. రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ ఆగస్టు టూర్‌తో అది భర్తీ కానుందని బీసీబీ వెల్లడించింది. అయితే ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సిరీస్‌లో టీమ్ఇండియా పాల్గొనేది కూడా అనుమానమే.
