మేడారం తిరుగువారానికి వెళ్తుండగా బొలెరో బోల్తా.. 15 మందికి గాయాలు
ములుగు/మేడారం:
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి–మేడారం మార్గంలో తిరుగువారం పండుగకు వెళ్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తిరుగువారం పండుగ సందర్భంగా మేడారానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగ ఘనంగా జరుగుతోంది. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత తిరుగువారం జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, దీపాలు వెలిగించి, యాటను నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
పూజారుల కుటుంబసభ్యులు, ఆదివాసీలు, గిరిజనేతరులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పూజలు పూర్తయ్యాక పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరచనున్నారు. తిరుగువారంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగియనున్నాయి.
అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పునుగొడ్లలో పగిడిగిద్దె రాజు తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకోనున్నారు.
