ఇండియా–యూఎస్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్‌థ్రూ.. భారత ఎగుమతులపై సుంకాలు 18%కి కట్.. రైతులు, MSMEsకి భారీ లాభం!
చాలా కాలంగా చర్చల దశలోనే ఉన్న ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్ ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. రెండు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18 శాతానికి తగ్గించింది. దీంతో భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో కొత్త ఊపొస్తుందని మోడీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు ఎలాంటి నష్టం లేదని, పైగా వారికి ఇది అత్యంత లాభదాయకమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరిన ఈ తాత్కాలిక ట్రేడ్ డీల్ ద్వారా భారత ఎగుమతిదారులకు దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని, ఎక్కడా జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగనివ్వలేదని గోయల్ పేర్కొన్నారు. ఈ డీల్ ద్వారా ముఖ్యంగా రైతులు, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) భారీ లాభం చేకూరుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ వంటి ప్రాంతాల్లోని హస్తకళాకారులకు కొత్త ఆర్డర్లు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఉదాహరణగా చెప్పారు.
వ్యవసాయ రంగంలో భారత్ స్వయం సమృద్ధిగా ఉన్న ఏ ఒక్క ఉత్పత్తిపైనా దిగుమతి రాయితీలు ఇవ్వలేదని గోయల్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి రెడ్ సోర్గం, ట్రీ నట్స్, వైన్ వంటి కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే పరిమిత స్థాయిలో మార్కెట్ యాక్సెస్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికాలో ‘జీరో డ్యూటీ’ లభించనుంది. టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనెతో పాటు అరటి, మామిడి, జామ, అవకాడో, కివి, పైనాపిల్, పుట్టగొడుగులు, బార్లీ, జీడిపప్పు, అరికా నట్స్, బ్రెజిల్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్, కొన్ని బేకరీ ఉత్పత్తులు, తృణధాన్యాలపై కూడా పన్ను మినహాయింపు వర్తించనుంది. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
వ్యవసాయంతో పాటు ఇతర కీలక రంగాల్లోనూ భారత్‌కు ఊరట లభించింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వజ్రాలపై ఇకపై అమెరికాలో ఎలాంటి సుంకం ఉండదు. అలాగే భారతీయ ఔషధాలకు అమెరికా మార్కెట్లో సున్నా పన్ను వర్తించనుంది. భారత్‌లో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు కూడా జీరో డ్యూటీ ప్రయోజనాన్ని కొనసాగిస్తాయి.
మార్చి మధ్యలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ట్రంప్ ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం కుదిరిన ఈ డీల్ భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రైతుల ప్రయోజనాల రక్షణతో పాటు విదేశీ మార్కెట్లలో భారత ఉత్పత్తుల వాటాను పెంచడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
