మార్చి 31లోపు విద్యుత్ స్తంభాలపై వేలాడే కేబుల్ వైర్లు తొలగించాలి: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హనుమకొండ సిటీ :
విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడుతున్న కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ వైర్లను మార్చి 31లోపు పూర్తిగా తొలగించాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లను ఆదేశించారు.
బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌లో కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించిన ఆయన, విద్యుత్ స్తంభాలపై ఉన్న వైర్లను క్రమపద్ధతిలో బంచ్ చేయాలని సూచించారు. కేబుల్ వైర్లన్నింటినీ కనీసం 18 నుంచి 20 అడుగుల గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లకు సంబంధించిన జీపీఎస్ మ్యాపింగ్ వివరాలను టీజీఎన్‌పీడీసీఎల్‌కు అందజేయాలని ఆదేశించారు. వివిధ ఏజెన్సీలు తమ పరిధిలోని పనులు కొంతమేర పూర్తయ్యాయని తెలిపినట్లు చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఇంకా రెండు నెలల గడువు ఇవ్వాలని ఆపరేటర్లు కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ సంస్థ ప్రతినిధులు, వినియోగంలో లేని కేబుళ్ల తొలగింపు, కేబుళ్లను సక్రమంగా బంచ్ చేసే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎండీకి వివరించారు.
ఈ సమావేశంలో టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ టి. మధుసూదన్, సీఈలు, ఎస్ఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.
