అచ్చు సీబీఐ ఆఫీసేలా సెటప్… కంబోడియా స్కామ్ సెంటర్ వీడియోలతో కలకలం
అచ్చు సీబీఐ ఆఫీసేలా సెటప్… కంబోడియా స్కామ్ సెంటర్ వీడియోలతో కలకలం
వాటే క్రేజీ సెటప్..! అచ్చు సీబీఐ కార్యాలయమే అన్నట్టుగా లోగోలు, జాతీయ జెండా, ప్రముఖుల ఫొటోలు… మరో గదిలో ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని తలపించే ఏర్పాట్లు… చూసినవారికి నిజమైన దర్యాప్తు సంస్థ ఆఫీసే అనిపించేలా రూపొందించిన స్కామ్ సెంటర్. భారతీయులను లక్ష్యంగా చేసుకుని విదేశాల నుంచి సైబర్ నేరగాళ్లు నడిపిస్తున్న భారీ మోసం గుట్టు రట్టు అయ్యింది. కంబోడియాలో బయటపడిన ఈ స్కామ్ సెంటర్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆందోళన రేపుతున్నాయి.
రాయిటర్స్ వెలుగులోకి తెచ్చిన ఈ వీడియోల్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎలా మోసాలు చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. జర్నలిస్ట్ మున్సిఫ్ వెంగట్టిల్ X (ట్విట్టర్)లో షేర్ చేసిన క్లిప్‌లో, పాడుబడిన భవనాన్ని సీబీఐ కార్యాలయంలా మలచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గదిలో సీబీఐ లోగో, భారత జాతీయ పతాకం, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. బాధితులకు వీడియో కాల్స్ చేసి “మేమే సీబీఐ అధికారులు” అని నమ్మించేలా మొత్తం వాతావరణాన్ని సృష్టించారు.
అదే భవనంలో మరో గదిని ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లా తయారు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు పేరుతో బెదిరించి, “డిజిటల్ అరెస్ట్”లో ఉన్నారని చెప్పి, వీడియో కాల్‌లో గంటల తరబడి ఉంచి చివరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడైంది.
ఇంతకాలంగా డిజిటల్ అరెస్ట్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోట్ల రూపాయలు ఎలా దోచుకుంటున్నారు? అనే ప్రశ్నలకు ఈ వీడియోలు సమాధానంగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాల నెట్‌వర్క్ ఎంత సుశ్రుతంగా పనిచేస్తోందో ఇది చూపిస్తోంది.
ఈ వీడియోపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా స్పందించారు. Xలో క్లిప్ షేర్ చేస్తూ “హై క్రేజ్ ఈ దిస్” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్కామర్లు సృష్టించిన నకిలీ సెటప్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల డిజిటల్ అరెస్ట్ మోసాలపై అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. “మేమే సీబీఐ, ఈడీ, పోలీస్ ఉన్నతాధికారులు” అంటూ కాల్ చేసి, డ్రగ్స్ లేదా మనీలాండరింగ్ కేసుల్లో మీ పేరు ఉందని బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇలాంటి కాల్స్‌ను నమ్మొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు ఏమిటి?
- సీబీఐ, ఈడీ, పోలీస్ అధికారులు వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేయరు.
- ఎవరైనా కేసు పేరుతో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమంటే వెంటనే కాల్ కట్ చేయాలి.
- అనుమానాస్పద కాల్స్‌ను 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
- వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంక్ సమాచారం ఎప్పుడూ పంచుకోకూడదు.
సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లకు బలి కాకుండా అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
