Changes from January: రైల్వే టైమ్ టేబుల్ To క్రెడిట్ స్కోరు.. జనవరి నుంచి కీలక మార్పులు
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక విషయాల్లో 2025లో చాలా మార్పులు వచ్చాయి. సామాన్యులపై ప్రభావం చూపే ఆదాయపు పన్ను ఊరట, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. రైల్వేకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు 2026లోనూ ఆ ఒరవడి కొనసాగనుంది. సామాన్యుల జేబులు, నిత్య జీవితంపై ప్రభావం చూపే మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆశలు, ఆశయాలతో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ అవేంటో చూసేద్దాం..
క్రెడిట్ రిపోర్ట్ మరింత వేగంగా..
క్రెడిట్ బ్యూరోల వద్ద ఇప్పటివరకు 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అవుతోంది. ఇకపై బ్యాంకులు వారానికోసారి బ్యూరోలకు నివేదించాలి. జనవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. దీనివల్ల రుణ అర్హత, క్రెడిట్ హిస్టరీ వంటివి త్వరగా వినియోగదారుల క్రెడిట్ స్కోరులో ప్రతిబింబిస్తాయి.
8వ వేతన కమిషన్
డిసెంబర్ 31తో 7వ వేతన కమిషన్ గడువు ముగియనుంది. 8వ వేతన కమిషన్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనప్పటికీ.. వేతన పెంపు నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీన వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలగనుంది.
పాన్-ఆధార్ లింక్
ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఐడీ ద్వారా పాన్ కార్డు తీసుకున్నవారు డిసెంబరు 31లోగా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దయి, కార్డు నిలిచిపోతుంది. దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో ఆటంకం ఎదురవుతుంది. జనవరి ఒకటో తేదీ తర్వాత రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించి పాన్ కార్డు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
రైల్వే టైమ్ టేబుల్
కొత్త ఏడాదిలో రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు జరగనున్నాయి. కొత్త టైం టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సహా మొత్తం 25 రైళ్లు వేళలు మారనున్నాయి. పూర్తి కథనం కోసం..
ఆధార్ లింక్ అయితేనే..
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌లో (ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు) బుకింగ్‌కు సంబంధించి నిబంధనలను రైల్వే శాఖ మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం జనరల్ రిజర్వేషన్ విండో తెరుచుకున్న వెంటనే ఐఆర్‌సీటీసీ యాప్/వెబ్‌సైట్‌లో తొలి 15 నిమిషాల్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ అవకాశం ఉంది. ఈ సమయాన్ని డిసెంబర్ 29, 2025 నుంచి నాలుగు గంటలకు పెంచింది. అంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు టికెట్ బుక్ చేయాలంటే ఆథార్ అథంటికేటెడ్ అకౌంట్లకే అవుతుంది. ఇక జనవరి 5 నుంచి ఈ సమయం సాయంత్రం 4 వరకు; 12వ తేదీ నుంచి రాత్రి 12 గంటల వరకు పెంచనుంది. దీని వల్ల టికెట్ల అక్రమాలకు చెక్ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.
కార్ల ధరల పెంపు
జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, నిస్సాన్, రెనో, జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్, బీవైడీ కంపెనీల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా తన స్కూటర్లపై రూ.3 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఎల్‌పీజీ ధరలు
ఎల్‌పీజీ, కమర్షియల్ గ్యాస్, ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలా 1న చమురు కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఈసారి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గే అవకాశముంది. దీంతో పాటు ఐటీ రిటర్నులకు సంబంధించిన కొత్త ఫారాలు జనవరిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
