Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి: ఐజీ సుందర్‌రాజ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మంది మహిళలతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్‌లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్‌తో కలిసి ఎన్‌కౌంటర్ వివరాలను గురువారం వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కాల్పుల్లో మృతి చెందిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉందని చెప్పారు. మృతుల్లో మావోయిస్టు పీఎల్జీ రెండో బెటాలియన్ కమాండర్ వెల్ల మోడియంతో పాటు కంపెనీ నెంబర్ 2, 7లకు చెందిన కీలక మావోయిస్టులు.. రైను ఓఎం, సన్ను అవలం, నందా మీడియం, లాలు, రాజు పూణెం, రమేష్ కవాసి, లక్ష్మీ తాటి, బండి, మద్వి, సుకీ లేఖం, సోమ్ది కుంజం, చందు కుర్శం, మాసే, రీనా మార్కం, సోనీ మద్వి, సంగీత పద్దంగా గుర్తించామన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. బస్తర్ పరిధిలో గత 19 నెలల్లో వివిధ ఎన్‌కౌంటర్లలో 469 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజీ వివరించారు. మావోయిస్టులు లొంగిపోకుంటే భద్రతా దళాలను ఎదురుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
