బెడ్ కింద ర్యాక్‌లో దాచిన బాల కార్మికురాలు.. గౌహటిలో మానవత్వాన్ని వణికించిన దారుణం
గౌహటి నగరంలో మానవత్వాన్ని దిగజార్చే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహటిలోని పంజాబరి ప్రాంతంలో ఓ కుటుంబం చిన్నారిపై చేసిన అమానుష ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిషేధమని తెలిసినా, కనీస మానవీయత లేకుండా ఆ కుటుంబం కేవలం ఆరు ఏళ్ల వయసున్న 13 ఏళ్ల బాలికను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుని వెట్టి చాకిరి చేయించుకుంది.
ఈ వ్యవహారంపై స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదు అందింది. సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ లేబర్ టాస్క్ ఫోర్స్, పోలీసులతో కలిసి పంజాబరిలోని అమీన్ అక్తర్ లష్కర్ (హౌస్ నంబర్ 69, జురిపార్) ఇంటిపై ఆదివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. అధికారులు వస్తున్న సంగతి ముందే గమనించిన ఆ కుటుంబం, తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు మరింత దారుణానికి పాల్పడింది.
ఇంట్లో పని చేస్తున్న ఆ చిన్నారిని మంచం కింద ఉన్న ర్యాక్‌లో దాచేసింది. పైకి ఎలాంటి అనుమానం రాకుండా, అదే మంచం మీద ఇంటి యజమాని తన పిల్లాడిని దుప్పటి కప్పి పడుకోబెట్టారు. అధికారులు ఇంటిని పూర్తిగా తనిఖీ చేస్తుండగా, అనుమానం వచ్చి మంచాన్ని కదిలించగా… కింద ర్యాక్‌లో బిక్కుబిక్కుమంటూ ఆ బాలిక కనిపించింది. గాలి, వెలుతురు కూడా సరిగా లేని ఇరుకైన చోట సుమారు 25 నిమిషాల పాటు ఆ చిన్నారి గడిపినట్టు అధికారులు గుర్తించారు.
ఈ దృశ్యాలను కళ్లారా చూసిన డిస్ట్రిక్ట్ లేబర్ టాస్క్ ఫోర్స్ మేజిస్ట్రేట్ సైతం షాక్‌కు గురయ్యారు. చిన్నారి పరిస్థితి చూసి అక్కడే భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను సురక్షితంగా బయటకు తీసి అవసరమైన సహాయం అందించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా… ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిన్నారులపై ఇలాంటి అమానుషత్వం మళ్లీ జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
