తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. పెరుగుతున్న స్థిర ఖర్చులు, అప్పుల భారంతో బడ్జెట్‌పై ఒత్తిడి
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించే దశలోకి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి, సమతుల్య పరిపాలనకు ప్రతిబింబంగా ఉండాల్సిన బడ్జెట్ ప్రభుత్వం పనితీరు, ఆలోచనా విధానాన్ని ప్రతిఫలిస్తుంది. అయితే 2014 తర్వాత తెలంగాణ బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే ప్రకటించిన దానికంటే దాచిపెట్టిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో శాసనసభలో జరిగే చర్చలు సార్థకంగా లేకుండా ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్‌లో వచ్చే ఆదాయంలో దాదాపు 70 శాతం వరకు ఇప్పటికే నిర్ణయించబడిన ఖర్చులకే వెళ్తోంది. వీటిలో గత ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, అలాగే కాలక్రమేణా పేరుకుపోయిన బాద్యతలు ఉన్నాయి. ఇవి ఒక విధంగా “ఫిక్స్‌డ్ ఛార్జెస్”గా మారాయి. ఫలితంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడానికి ప్రతి సంవత్సరం కేవలం రూ.10 వేల నుంచి రూ.15 వేల కోట్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అంచనా. అదనపు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు సంవత్సరానికి సుమారు రూ.72 వేల కోట్లకు చేరుకున్నాయి. నెలకు దాదాపు రూ.6 వేల కోట్ల వరకు జీతాల రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని అంచనా. రాష్ట్రంలో సుమారు 5 లక్షల వరకు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవస్థలో కూడా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ నియామకాలలో 5 వేల మందికి పైగా నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఆధార్ వివరాలు సేకరించిన తర్వాత ఈ స్కామ్ బయటపడగా, జీతాల పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వీరి బెనిఫిట్స్ చెల్లించడానికి సుమారు రూ.6 వేల కోట్లు అవసరమని అంచనా. మరోవైపు ఉద్యోగుల బకాయిలు ఇప్పటికే రూ.9 వేల కోట్లను దాటాయి. ప్రస్తుతం నెలకు సుమారు రూ.700 కోట్ల చొప్పున బకాయిలు చెల్లిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్న పలు పెద్ద ప్రాజెక్టులూ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంట్ సబ్సిడీ, హైదరాబాద్ రింగ్ రోడ్డు, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మిషన్ భగీరథ, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, మెట్రో రైలు ప్రాజెక్టులు, మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు వంటి పలు ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయి.
2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ పరిమాణం సుమారు రూ.3.2 నుంచి రూ.3.25 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. నెలకు సగటు ఖర్చు రూ.26,500 నుంచి రూ.27,000 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నుయేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు కలిపి నెలకు సుమారు రూ.12 వేల కోట్ల వరకు మాత్రమే వస్తున్నాయని అంచనా. దీంతో ఆదాయం–ఖర్చుల మధ్య గణనీయమైన అంతరం ఏర్పడుతోంది.
ఇక రాష్ట్రంపై అప్పుల భారం కూడా పెరుగుతోంది. గతంలో విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్ర అప్పులు గణనీయంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయడం, వడ్డీలు చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకోవడం వల్ల అప్పుల భారమే పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాగునీటి శాఖ కింద మాత్రమే రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు, వడ్డీలు చెల్లించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అధిక వడ్డీ రుణాల స్థానంలో తక్కువ వడ్డీ రేట్లు ఉన్న రుణాలను తీసుకోవడం, అప్పుల పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారా ఖజానాపై భారం తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ భవిష్యత్తులో విచ్చలవిడిగా అప్పులు చేయకుండా కట్టుదిట్టమైన ఆర్థిక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
