అయేషా మీరా కేసులో ముగింపు: 19 ఏళ్ల న్యాయ పోరాటం వృథా — ఆధారాలు లేవంటూ సీబీఐ క్లోజ్ రిపోర్ట్
ఇబ్రహీంపట్నం: రాష్ట్రాన్ని కుదిపేసిన అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 19 ఏళ్లుగా బాధితురాలి తల్లిదండ్రులు సాగిస్తున్న న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ సీబీఐ కేసును క్లోజ్ చేసింది. తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ అసలు దోషి ఎవరో తేల్చలేకపోయినట్లు తెలిపింది.
2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని అయేషా మీరా దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రారంభ దర్యాప్తుల్లో సత్యంబాబుపై ఆరోపణలు మోపగా, అనంతరం విచారణల అనంతరం అతను నిర్దోషిగా తేలి విడుదలయ్యాడు.
ఈ కేసును 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించారు. ఆరు సంవత్సరాల పాటు దర్యాప్తు చేసిన సీబీఐకి ఎలాంటి కొత్త ఆధారాలు దొరకలేదని వెల్లడించింది. దీంతో కేసును పరిష్కరించడం సాధ్యం కాలేదని పేర్కొంటూ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది.
ఇక రీ-పోస్టుమార్టం కోసం సేకరించిన తమ కుమార్తె అవశేషాలను తిరిగి ఇవ్వాలని అయేషా మీరా తల్లి కోరారు. మత ఆచారాల ప్రకారం ఈ నెల 27న అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం.
దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసు అధికారికంగా ముగిసినట్లైంది. అయితే అసలు నిందితుడు ఎవరో ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడం బాధిత కుటుంబాన్ని మరింత వేదనకు గురిచేస్తోంది.
