కాంగ్రెస్ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు
మేడ్చల్, ఫిబ్రవరి 7 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధి లాల్‌గడి మలక్‌పేటలో శుక్రవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. శనివారం నాడు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తామంతా ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో, సుమారు 100 మంది కాంగ్రెస్ గుండాలు కావాలనే గొడవ సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలపై పెద్ద శబ్ధంతో పాటలు పెట్టి, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొడవకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఏసీపీ, సీఐల ముందే కోడిగుడ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తన గన్‌మెన్లు రక్షణగా లేకపోయి ఉంటే, వజ్రేష్ యాదవ్ అనుచరులు తమపై మరింత తీవ్రంగా దాడి చేసి ఉండేవారని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఖండిస్తూ, బాధ్యుడైన వజ్రేష్ యాదవ్ పై, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లారెడ్డి పోలీస్ కమిషనర్‌ను కోరారు.
