మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
సీఎం రేవంత్ నేతలతో జూమ్ మీటింగ్… గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం
మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పీఏసీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సీఎం రేవంత్ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
‘సర్వేలు అనుకూలంగా ఉన్నాయి… రెబల్స్‌కు ఛాన్స్ ఇవ్వొద్దు’
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేశారు.
“సర్వేలు మంచి మెజారిటీతో గెలుపు మనదేనని ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాయి. అందరూ సమిష్టిగా కృషి చేయాలి. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీ కోసం కష్టపడిన వారినే గెలిపించుకోవాలి,” అని నేతలకు సూచించారు.
టికెట్లు రాని బలమైన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వాలని చెప్పారు. అభ్యర్థిని ఖరారు చేసిన నేతలే గెలుపు బాధ్యత తీసుకోవాలని, ప్రతి అభ్యర్థి స్థానిక అవసరాలకు అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అలాగే, బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 11న పోలింగ్… 13న కౌంటింగ్
మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
