భూ మాఫియాకు కాంగ్రెస్ అండ: ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు
ఘట్‌కేసర్ (హైదరాబాద్): రాష్ట్రంలో రోజురోజుకు భూ మాఫియా రెచ్చిపోతుందని, వారికి అన్ని విధాలా కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్‌లో శనివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతనం ఏకశిల వెంచర్‌ను సందర్శించి ఇంటి స్థల యజమానులతో మాట్లాడి దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. 1985లో 146 ఎకరాల్లో 2086 ఇంటి స్థలాలను చిన్నచిన్న ఉద్యోగులు కొనుగోలు చేశారని తెలిపారు. భూ మాఫియా లీడర్ వెంకటేశ్ రెవెన్యూ రికార్డుల్లో ఉండే లొసుగులను ఆసరా చేసుకొని, రెవెన్యూ విభాగంలోని అవినీతి అధికారులు, భూమి యజమానితో కలిసి ఏకశిలా వెంచర్‌లో 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. డబ్బులకు ఆశపడి అప్పటి రెవెన్యూ అధికారులు గుండాలకు మద్దతిచ్చారన్నారు. సింగరేణిలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కూరగాయలు, పాలు అమ్ముకొనే వారు ఇక్కడి స్థలాలను కొనుగోలు చేశారన్నారు. వారిని బెదిరించి స్థలాలను కాజేయాలని వెంకటేశ్ చూస్తున్నాడని, ఇది ముమ్మాటికి సాగదని స్పష్టం చేశారు. పోలీసులు ఉన్నది చట్టాన్ని కాపాడటానికి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి.. గుండాల మీద ఉక్కు పాదం మోపడానికి లా అండ్ ఆర్డర్ కాపాడటానికి.. కానీ భూ మాఫియాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
