తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ే.. బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కోసం ఎన్నికయ్యామని, మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
శనివారం (ఫిబ్రవరి 7) ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రయత్నిస్తే ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని, అభివృద్ధి పనులకు కాళ్లలో కట్టెలు పెడుతున్నాయని మండిపడ్డారు.
ప్రధాని మోడీని చూసి బీజేపీకి ఓటేయాలని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శిస్తూ.. “ఎక్కడైనా పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా?” అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి మోడీ వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. మోడీని చూసి ఓటేస్తే తెలంగాణ బీజేపీ నేతలు పని చేయరని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో భార్యాభర్తల వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక చర్యలకు నోటీసులు ఇవ్వకపోతే ఇంకేమి చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర దొంగ పాస్‌పోర్టులు, దొంగ నోట్ల చరిత్రతో నిండిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులను సీఎం చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మొఖం చెల్లకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.
రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, గత పాలకుల తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
