ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం.. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి: నితిన్ నబీబ్
మహబూబ్‌నగర్:
ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప్ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా నితిన్ నబీబ్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నేలపై పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సహా బలహీన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా ఆర్‌ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మండిపడ్డారు.
అవినీతి, కమీషన్లతో నడిచే ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని నితిన్ నబీబ్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భాజపాను గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సముచితంగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ.5,400 కోట్లకు పైగా కేటాయించడంతో పాటు, మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం కొనసాగుతోందని, మోదీ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని దేశాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని వివరించారు.
కొన్ని వర్గాలను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కోతలు పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను భాజపా సహించబోదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
