మెదక్‌లో కాంగ్రెస్‌దే గెలుపు లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్, ఫిబ్రవరి 4, 2026:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉద్యమం చేశారని, అయితే బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నదని ఉపాధి–కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుని, వ్యక్తిగతంగా మరియు పార్టీ పరంగా ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారని ఆరోపించారు.
మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇంచార్జి హోదాలో సమావేశమైన మంత్రి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఆకాశమంత ఎత్తుకు పెరిగాయని, బీఆర్‌ఎస్ పార్టీకి సుమారు రూ.800 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. మేఘా కృష్ణా రెడ్డి ద్వారా రూ.400 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోయినా, అప్పటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలను ఎవరూ ఖండించకపోవడమే అవన్నీ నిజాలేనని స్పష్టం చేస్తోందన్నారు.
ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని, రాష్ట్ర ఆదాయం కేవలం రూ.లక్ష కోట్ల పరిధిలోనే ఉండడంతో వడ్డీలకే సరిపోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతోందని వివరించారు.
మహిళల కోసం ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటికే రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు నెలకు సగటున రూ.3 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీకి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.23 వేల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వడ్డీ లేని రుణాలను కూడా పూర్తిగా చెల్లించామని వెల్లడించారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి సెగ్మెంట్ వారీగా సమీక్షలు నిర్వహించారని, రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌లో 90 శాతం వరకు విజయం సాధిస్తామని, మున్సిపాలిటీలోని మొత్తం 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమయం తక్కువగా ఉన్నందున ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయాలని సూచించారు.
మైనంపల్లి హనుమంతరావు ఉన్న కారణంగా హరీశ్ రావు మెదక్‌పై ఎక్కువ దృష్టి పెడతారని, కానీ అధికారంలో ఉన్న సమయంలో మెదక్, దుబ్బాక నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రెండు లైన్ రోడ్లను నాలుగు లైన్లుగా మార్చుకుని, మేఘా ప్రాజెక్టులు మరియు కార్యాలయాలను మెదక్ నుంచి తరలించారని ఆరోపించారు. హరీశ్ రావును రాజకీయంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
