జేఈఈ మెయిన్ 2026 ఫలితాలకు కౌంట్‌డౌన్ – ఫైనల్ కీ విడుదల, ఎప్పుడైనా రిజల్ట్స్
ఇంటర్నెట్ డెస్క్:
జేఈఈ మెయిన్ 2026 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో National Testing Agency (ఎన్టీఏ) అధికారులు సోమవారం ఉదయం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేశారు. దీంతో ఫలితాలు ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా అవి వాయిదా పడ్డాయి. అయితే ఫిబ్రవరి 16లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని ఎన్టీఏ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఫైనల్ కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో ఫలితాల ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
ఎక్కడ చెక్ చేసుకోవాలి?
ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు jeemain.nta.nic.in మరియు nta.ac.in వెబ్సైట్లలో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన National Institutes of Technology (ఎన్ఐటీలు), Indian Institutes of Information Technology (ట్రిపుల్ ఐటీలు)లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 29 వరకు తొలి విడత (పేపర్ 1, పేపర్ 2) పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించారు. పేపర్-1 (బీఈ/బీటెక్)కు సుమారు 13.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 95 శాతం మంది హాజరైనట్లు అంచనా.
ఫిబ్రవరి 4న ప్రొవిజినల్ కీ విడుదల చేసిన అధికారులు, ఈనెల 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఫైనల్ కీ విడుదల చేశారు. ఇక ఫలితాల ప్రకటనతో అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడనుంది.
