భారీ భద్రత మధ్య మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
హనుమకొండ, ఫిబ్రవరి 5:
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 200 మంది అధికారులు, 300 మంది వాలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రాంతమంతా 20 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు జరగనుంది.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు ఆదివాసి పూజారులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది జాతరతో పోలిస్తే ఈ ఏడాది 288 అదనపు హుండీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 828 హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్నారు.
జాతర సమయంలో బెల్లం, కొబ్బరి నీళ్ల కారణంగా తడిసిపోయిన కరెన్సీ నోట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు.
