Crime News: పాఠాలు చెప్పాల్సినవారు.. ప్రాణాలు తీశారు
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే: పిల్లలకు నీతిసూత్రాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు హంతకులయ్యారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తనే హత్య చేసి జైలుపాలయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సీఐ నాగరాజు బుధవారం ఈ కేసు వివరాలు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో నవంబరు 25న అనుమానాస్పద స్థితిలో లక్ష్మణ్‌నాయక్ (38) మృతి చెందారు. ఆయన సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మణ్‌నాయక్ భార్య పద్మ (30) 2024 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై.. ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది. అదే మండలంలోని తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాత్లావత్ గోపి (36)తో ఆమెకు ఏడాది కాలంగా వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మణ్‌నాయక్ గతంలో రంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. భార్యకు పోస్టింగ్ రావడంతో అచ్చంపేటకు వచ్చేసి.. ఖాళీగానే ఉండేవారు. తమ సంబంధానికి లక్ష్మణ్‌నాయక్ అడ్డుగా ఉన్నాడని భావించి పద్మ, గోపి అతడిని అంతమొందించాలనుకున్నారు. నవంబరు 24 రాత్రి.. నిద్రిస్తున్న లక్ష్మణ్‌నాయక్ ముక్కు, నోటిపై వస్త్రంతో మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మర్నాడు ఉదయం ఏమీ తెలియనట్లుగా పద్మ పాఠశాలకు వెళ్లి.. ఇంటి యజమానికి ఫోన్ చేసింది. తన భర్తకు ఫోన్ చేసినా స్పందించడంలేదని ఆందోళన నటించింది. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికొచ్చి.. లోపల భర్త చనిపోయి ఉన్నాడని అందరినీ నమ్మించింది. దర్యాప్తులో పోలీసులు వాస్తవాలను రాబట్టారు. హత్య చేసిన అనంతరం పద్మ.. సమీప బంధువు నర్సింహకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పద్మ, గోపిలను బుధవారం అరెస్టు చేసి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి స్పందన ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
