గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దు: సీపీ సజ్జనార్
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు ఇస్తూ వెంటనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనంగా సిలిండర్లు అందిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు.
ఇలాంటి సందేశాలు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచించారు. గ్యాస్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు లేదా గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే వినియోగించాలని కోరారు.
అలాగే ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.
