డెక్కన్ క్రానికల్ ఉద్యోగుల విజయం
తప్పుగా లెక్కించిన పీఎఫ్ బకాయిలు రూ.6 కోట్లు చెల్లించాల్సిందే
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, ఫిబ్రవరి 9, 2026:
డెక్కన్ క్రానికల్ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి) బకాయిలకు సంబంధించిన అప్పీల్‌ను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ట్రిబ్యునల్ (సీజీఐటీ)ను హైకోర్టు ఆదేశించింది.
ఈపీఎఫ్ బకాయిలపై అప్పీల్‌ను విచారణకు స్వీకరించేందుకు 30 శాతం ప్రీ-డిపాజిట్ తప్పనిసరి అని సీజీఐటీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ప్రీ-డిపాజిట్‌ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తూ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తిక్ ఆదేశాలు జారీ చేశారు.
డెక్కన్ క్రానికల్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ మొత్తాన్ని తప్పుగా లెక్కించి తక్కువగా చెల్లించినందుకు సంబంధించి బకాయిలను వెంటనే చెల్లించాలని పీఎఫ్ కమిషనర్ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ డెక్కన్ క్రానికల్ యాజమాన్యం సీజీఐటీని ఆశ్రయించింది. అయితే అప్పీల్ విచారణకు ముందు 30 శాతం ప్రీ-డిపాజిట్ తప్పనిసరి అని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
దీనిపై హైకోర్టును ఆశ్రయించిన డెక్కన్ క్రానికల్, ఈపీఎఫ్ చట్టంలో ఇంత అధిక ప్రీ-డిపాజిట్‌కు స్పష్టమైన నిబంధన లేదని వాదించింది. వాదనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన హైకోర్టు, ట్రిబ్యునల్‌కు షరతులు విధించే అధికారం ఉన్నప్పటికీ, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిపాజిట్ శాతాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
హైకోర్టు సవరించిన షరతుల మేరకు సీజీఐటీ ముందు అప్పీల్‌ను కొనసాగించి, కేసును త్వరితగతిన పరిష్కరించాలని ట్రిబ్యునల్‌ను ఆదేశించింది.
దీంతో పీఎఫ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఉద్యోగులకు 2017 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ వరకు తక్కువగా లెక్కించిన రూ.5,93,06,774 పీఎఫ్ బకాయిలను సంస్థ చెల్లించక తప్పదు.
ఈ కాలానికి సంబంధించిన బకాయిలు చెల్లిస్తే, ప్రస్తుతం సేవలో ఉన్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5 నుంచి 6 లక్షల వరకు, 2017 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వారి పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. అయితే తుది లాభాలు ట్రిబ్యునల్ ఇచ్చే తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయి.
