మున్సిపల్ నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు హైడ్రామా
బీఫామ్‌లు దక్కక తిరుగుబాటు… రాజీనామాలు, ఆందోళనలు, చెప్పుల దాడులు
హైదరాబాద్ / నెట్‌వర్క్ :
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హైడ్రామా నడిచింది. బీ ఫామ్‌లు దక్కని పలువురు అభ్యర్థులు, పార్టీ నేతలపై బహిరంగంగా తిరుగుబాటు చేయగా, మరోవైపు బీఫామ్‌లు దక్కినా కొందరు చివరి నిమిషంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకుని ఏకగ్రీవాలకు సహకరించడం ఆసక్తి రేపింది.
కరీంనగర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిపై సొంత పార్టీ లీడర్లే చెప్పులు విసిరి, మట్టి పోసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో టికెట్లు రాకపోవడంతో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. సిరిసిల్లలో బీజేపీ మాజీ కౌన్సిలర్, కరీంనగర్‌లో బీజేపీ సిటీ మాజీ అధ్యక్షుడు బీ ఫామ్ ఇవ్వలేదని పార్టీకి గుడ్‌బై చెప్పారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మహిళా లీడర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టగా, జనగామలో అభ్యర్థులకు కాకుండా నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్లకే బీ ఫామ్‌లు అందజేశారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆ పార్టీ నేతలు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆందోళనకు దిగారు.
బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల తిరుగుబాటు
జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డుల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వర్గానికి 20 టికెట్లు కేటాయించారు. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో సంజయ్ వర్గానికి 8, జీవన్‌రెడ్డి వర్గానికి 4 సీట్లు ఇవ్వడంతో జీవన్‌రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత రాజీనామాలు చేశారు.
నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ బీ ఫామ్ దక్కకపోవడంతో పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలి శ్రీనివాసు పార్టీకి రాజీనామా చేయగా, కల్వకుర్తిలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి జగన్ టికెట్ నిరాకరణపై ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని నీలం శ్రీలత తీవ్ర నిరసన చేపట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేశారు. మహబూబాబాద్‌లో పొత్తుల పేరుతో అన్యాయం జరిగిందంటూ సీపీఐ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఫామ్ ఉన్నా విత్‌డ్రాలు
రామగుండం కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు అభ్యర్థులు బీ ఫామ్‌లు వచ్చినప్పటికీ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 60 డివిజన్లలో 56 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. కో-ఆప్షన్ పదవి హామీతో మూడు డివిజన్లలో సీపీఎం అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.
కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌లలో ఒకే డివిజన్‌కు ఇద్దరికి కాంగ్రెస్ బీ ఫామ్‌లు ఇవ్వడం గందరగోళానికి దారి తీసింది. అధికారిక అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది.
పోలీసు బందోబస్తు మధ్య బీఫామ్‌ల సమర్పణ
నాగర్‌కర్నూల్‌లో 15వ వార్డును ఏకగ్రీవం చేయాలన్న కాంగ్రెస్ యత్నం విఫలమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జోక్యంతో నసీమా బేగం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసుల బందోబస్తు మధ్య ఆమె బీఫామ్ సమర్పించారు.
జనగామ మున్సిపాలిటీలో అభ్యర్థులు విత్‌డ్రా చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇన్‌చార్జీలు నేరుగా ఆర్వోలకే బీ ఫామ్‌లు అందజేశారు.
పార్టీ మారబోమని ప్రమాణం తర్వాతే బీఫామ్‌లు
హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ నేతలు అభ్యర్థులతో దేవుని సాక్షిగా ప్రమాణం చేయించుకుని పార్టీ మారబోమని హామీ తీసుకున్న తరువాతే బీ ఫామ్‌లు ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యర్థులతో ఇలానే ప్రతిజ్ఞ చేయించారు.
కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిపై చెప్పులు, మట్టి విసిరి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ఇంటి ముందు కరపత్రాలు దహనం చేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ టికెట్ నిరాకరణలపై రాజీనామాలు, దిష్టిబొమ్మ దహనాలు చోటుచేసుకున్నాయి.
కోదాడలో ఏకగ్రీవం
సూర్యాపేట జిల్లా కోదాడలో 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డిగర్ల గీత చివరి నిమిషంలో నామినేషన్ విత్‌డ్రా చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. కాంగ్రెస్ బెదిరింపుల వల్లే విత్‌డ్రా జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే ఆ వార్డులో అన్ని నామినేషన్లు ఉపసంహరణ కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి దేవరం మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
