ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఈగల్ టీం మెరుపు దాడులు.. 4 రోజుల్లో 75 మంది పరారీలో నిందితుల అరెస్ట్
హైదరాబాద్:
తెలంగాణ పోలీసుల ఈగల్ టీం (EAGLE Team) స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పరారీలో ఉన్న నిందితులను రికార్డు స్థాయిలో అరెస్ట్ చేస్తోంది. చిన్న క్లూ దొరికినా చాలు.. మెరుపు దాడులతో నిందితులను అదుపులోకి తీసుకుంటూ డ్రగ్ మాఫియాలో భయాన్ని నింపుతోంది.
ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్స్, డ్రగ్స్) కేసులపై రాష్ట్రవ్యాప్తంగా డీజీపీ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ఈగల్ టీం, దేశవ్యాప్తంగా ఈ కేసుల్లో 3,228 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో 1,278 మంది తెలంగాణకు చెందినవారిగా నిర్ధారించింది.
2026 జనవరి 29 నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించగా, కేవలం 4 రోజుల్లోనే 75 మంది పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రికార్డు సృష్టించింది. అరెస్టయిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.
డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన అనుమానాలపై కుటుంబ సభ్యుల సమక్షంలో పారదర్శకంగా మూత్ర పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన 75 మందిలో 38 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వెల్లడించారు.
ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్స్ ఫిబ్రవరి నెలంతా కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈగల్ టీం పనిచేస్తోందని తెలిపారు. రాబోయే రెండు–మూడు సంవత్సరాల్లో డ్రగ్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇలాంటి ఆపరేషన్లు అన్ని యూనిట్‌లలో నిర్వహించాలని ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
