డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధ దంపతుల నుంచి రూ.15 కోట్ల మోసం
ఇంటర్నెట్ డెస్క్: వృద్ధ దంపతులు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కి తమ జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. 17 రోజులపాటు ‘డిజిటల్ అరెస్టు’ పేరిట జరిగిన ఈ భారీ మోసం తాజాగా దిల్లీలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓం తనేజా, ఆయన భార్య డా. ఇందిరా తనేజాలు దాదాపు 48 సంవత్సరాలు అమెరికాలో నివసిస్తూ ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు. రిటైర్‌మెంట్ అనంతరం 2015లో భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు.
గత డిసెంబర్ 24న ఆ దంపతులకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ‘మీపై మనీలాండరింగ్, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం సహా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి’ అంటూ బెదిరించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు డిజిటల్ అరెస్టులో ఉంటారని వీడియో కాల్‌లో హెచ్చరించారు.
ఈ వ్యవధిలో వివిధ దశలుగా రూ.14.85 కోట్లను వారి ఖాతాల నుంచి కాజేశారు. అనంతరం ‘ఆర్‌బీఐ ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే డబ్బులు తిరిగి వస్తాయి’ అంటూ స్కామర్లు వారిని తప్పుదోవ పట్టించారు. దీంతో వృద్ధ దంపతులు సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, తమపై ఎలాంటి అరెస్టు వారెంట్లు లేవని, సైబర్ మాయగాళ్లు మోసం చేశారని తెలుసుకున్నారు.
