డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధుడికి రూ.7 కోట్ల టోకరా
హైదరాబాద్: సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట మరో భారీ మోసానికి పాల్పడ్డారు. ఒక వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ.7 కోట్లు కాజేసిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదులోని వివరాల మేరకు.. సోమాజిగూడకు చెందిన వృద్ధుడు(81) గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గతేడాది అక్టోబరు 27న ఆయన వాట్సప్ నంబర్‌కు ఒక కాల్ వచ్చింది. మీరు ముంబయి నుంచి బ్యాంకాక్‌కు చేసిన కొరియర్‌లో ఒక ల్యాప్‌టాప్, 3 కిలోల వస్త్రాలు, 5 పాస్‌పోర్టులు, మాదకద్రవ్యాలు ఉన్నాయని అవతలి వ్యక్తి భయపెట్టాడు. తాను ఎటువంటి కొరియర్ పంపలేదని వృద్ధుడు ఫోన్ పెట్టేశారు. వెంటనే ముంబయి పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మరొకరు కాల్ చేశారు. మీరు మాదకద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తమ వద్ద ఆధారాలున్నాయని బెదిరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, మీరు ఇంటి నుంచి కదలకుండా డిజిటల్ అరెస్ట్ చేశామంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. వీడియోకాల్ చేయాలన్నారు. మీ ఆర్థిక లావాదేవీలు పరిశీలించాలని తొలుత రూ.19.80 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అక్టోబరు 29న మరోసారి సైబర్ మోసగాడు ఫోన్ చేసి నగదు లావాదేవీల్లో ఏదో సమస్య ఉందని చెప్పాడు. సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని లింక్ పంపారు. ఆయనతో యాప్ ద్వారా మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోని రూ.7,12,80,000 నగదు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. నగదు లావాదేవీలు పూర్తిగా పరిశీలించాక తిరిగి జమ చేస్తామని నమ్మించారు. అనంతరం వయోధికుడు సిగ్నల్ యాప్‌ను ఫోన్ నుంచి తొలగించారు. గతేడాది డిసెంబరు 29న మరోసారి ఫోన్ చేసిన మోసగాళ్లు కేసు మూసివేసేందుకు అదనంగా రూ.1.2 కోట్లు ఇవ్వాలని డిమాండు చేయడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఇటీవల ఒక పత్రికలో డిజిటల్ అరెస్టుపై వచ్చిన కథనాన్ని చూసి తాను మోసపోయినట్లు గ్రహించారు. శుక్రవారం 1930 నంబరు ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు.
